VC Sajjanar: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించారు. ఆ ఖాతా ద్వారా వారు ఇతరులకు మోసపూరిత సందేశాలు పంపుతూ డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. “నేను ఆపదలో ఉన్నాను, వెంటనే నాకు డబ్బులు పంపండి” అంటూ ఈ ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని సీపీ సజ్జనార్ స్వయంగా తెలిపారు.
రూ.20 వేలు పోగొట్టుకున్న స్నేహితుడు
సైబర్ నేరగాళ్ల వలలో పడి ఇప్పటికే ఒకరు మోసపోయారు. సీపీ సజ్జనార్ స్నేహితుడు ఒకరు, ఈ నకిలీ మెసేజ్‌లను నిజమని నమ్మి, వారికి రూ.20 వేలు పంపించి మోసపోయారని సజ్జనార్ వివరించారు. ఈ ఘటనతో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
ఆ మెసేజ్‌లు నమ్మొద్దు: సజ్జనార్ విజ్ఞప్తి
తన పేరుతో డబ్బులు అడుగుతూ వచ్చే ఏ మెసేజ్‌ను కూడా ఎవరూ నమ్మవద్దని సీపీ సజ్జనార్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, అనుమానం కలిగించే లింక్‌లు, మెసేజ్‌లు లేదా వీడియో కాల్స్ లాంటివి వస్తే వెంటనే వాటిని బ్లాక్ చేయాలని సూచించారు. ఇలాంటి మోసపూరిత సైట్లను బ్లాక్ చేసి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. సైబర్ మోసాల గురించి ఫిర్యాదు చేయడానికి 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

