Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు సిద్ధమైంది. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఇన్నాళ్లుగా తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తూ వచ్చింది. అయితే ఇటు చట్టపరంగా, అటు న్యాయపరంగా చుక్కెదురవడంతో శరాఘాతమైంది. దీంతో 42 శాతం రిజర్వేషన్ సాధ్యంకాదని తేలిపోవడంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపినట్టు తెలుస్తున్నది.
Local Body Elections: నవంబర్ 17న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటాం.. అని నిన్న జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో అంతటా ఆసక్తి నెలకొన్నది. ఇక ఎన్నికల నిర్వహణకు సర్కారు మొగ్గుచూపిందని, ఆరోజు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నదని తేలిపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించింది. ఈ ఊపుతో స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటవచ్చని భావించిందని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
Local Body Elections: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులకు కలిపి మొత్తం రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించకూడదు. ఈ మేరకు పరిమితిని మించొద్దని మొత్తంగా 50 శాతం లోపే రిజర్వేషన్లను కేటాయించేందుకే సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకే బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది.
Local Body Elections: ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ నెలాఖరులోగానే వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే డిసెంబర్ తొలి వారంలో వస్తుందని అంటున్నారు. డిసెంబర్ నెలలోపే పరిషత్, పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసే యోచనలో ఉన్నట్టు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, గ్రామీణ ఓటర్లలోనూ పట్టుసాధించేందుకు అధికార పార్టీ అంచనాలు వేస్తున్నది.
