Telangana High Court: తెలంగాణ రాష్ట్రంలో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైంది. శనివారం ఉదయం ఈ సాంకేతిక సమస్యను గుర్తించారు. హైకోర్టు వెబ్సైట్లో ఆర్డర్ కాపీలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, వినియోగదారులకు బదులుగా నేరుగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఓపెన్ అయ్యాయి.
Also Read: Rana Daggubati: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో దగ్గుబాటి రానా
ఈ హ్యాకింగ్ ఘటనపై హైకోర్టు రిజిస్ట్రార్ వెంటనే స్పందించి, డీజీపీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. పోలీసులు వెంటనే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హ్యాకింగ్ వెనుక విదేశీ గేమింగ్ యాప్‌ల పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటనతో ఖంగుతిన్న ఎన్ఐసీ (NIC) అధికారులు వెంటనే రంగంలోకి దిగి, హ్యాక్ అయిన వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు (రీస్టోర్ చేశారు). అత్యంత కీలకమైన హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అవ్వడం, బెట్టింగ్ సైట్‌కు మళ్లించబడటం న్యాయవ్యవస్థ యొక్క సాంకేతిక భద్రతపై తీవ్ర ఆందోళనను పెంచింది. ఈ హ్యాకింగ్ వెనుక ఉన్న పూర్తి వివరాలు, దోషులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
