Jubilee Hills By-Election Counting: గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.
కౌంటింగ్ ఏజెంట్లుగా బీఆర్ఎస్ కీలక నేతలు
ఈ ఉపఎన్నిక ఫలితం కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు అత్యంత కీలకం కావడం వల్ల ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించడం విశేషం.
మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పల్లె రవి, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు పార్టీ ఏజెంట్లుగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కీలక నేతలు ఏజెంట్లుగా ఉండటంతో బీఆర్ఎస్ ఉపఎన్నికపై ఎంతగా దృష్టి సారించిందో స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి: Jubilee Hills By-Election Counting: జూబ్లీహిల్స్ పీఠం దక్కేది ఎవరికి..? కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం..
లెక్కింపు ప్రక్రియ వివరాలు
మొత్తం 186 మంది కౌంటింగ్ సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. విజేతను తేల్చేందుకు మొత్తం 42 టేబుల్స్‌పై 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. డివిజన్ల వారీగా చూస్తే, షేక్‌పేట డివిజన్‌తో లెక్కింపు ప్రారంభమై, ఎర్రగడ్డ డివిజన్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుంది.
పటిష్ట భద్రత: నిషేధాజ్ఞలు అమలు
కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 250 మందికి పైగా పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో నిషేధాజ్ఞలు (సెక్షన్ 144) అమలులో ఉన్నాయి. పోలీసులు ప్రజలను గుంపులుగా రావద్దని హెచ్చరించారు. అంతేకాకుండా, విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది ఫలితం వెల్లడి కానుంది.

