Jubilee Hills By-Election Counting: గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు (గురువారం) ఓట్ల లెక్కింపు జరగనుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియం ను కౌంటింగ్ కేంద్రంగా అధికారులు సిద్ధం చేశారు.
ఓట్ల లెక్కింపు వివరాలు
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 1,94,631 ఓట్లు పోలవగా, ఈ లెక్కింపు ప్రక్రియ ఇలా జరగనుంది. తొలిదశలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. మొత్తం 42 టేబుల్స్‌పై 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేయనుంది. షేక్‌పేట డివిజన్‌తో కౌంటింగ్ మొదలై, ఎర్రగడ్డ డివిజన్‌తో ముగుస్తుంది. కౌంటింగ్ ప్రక్రియలో 186 మంది సిబ్బంది పాల్గొంటారు.
ఇది కూడా చదవండి: Bihar Assembly Election Results: ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమవుతుందా..?నేడే బీహార్ ఎన్నికల ఫలితాలు
పటిష్టమైన భద్రత, సెక్షన్ 144 అమలు
తుది ఫలితం వెలువడుతున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 250 మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో సెక్షన్ 144 అమలులో ఉంటుంది. ప్రజలను గుంపులుగా రావద్దని పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా, విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు.
పోలింగ్ సరళి: తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలు
జూబ్లీహిల్స్‌లో నమోదైన పోలింగ్ శాతంపై విశ్లేషకులు దృష్టి పెట్టారు. డివిజన్ల వారీగా చూస్తే, అత్యధికంగా బోరబండ డివిజన్లో 55.92 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా సోమాజిగూడలో 41.99 శాతం నమోదైంది. 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైన 226 పోలింగ్ కేంద్రాలే తుది ఫలితాన్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 34 పోలింగ్ కేంద్రాల్లో 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం మీద, ఈ ఉపఎన్నికలో విజయం సాధించి జూబ్లీహిల్స్ పీఠం ఎవరికి దక్కుతుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

