Mahaa Conclave: ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల పాలనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘మహాన్యూస్ కాన్క్లేవ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వైఎస్సార్సీపీ పాలనను “రాక్షస పాలన”గా అభివర్ణించారు. ఆ సమయంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచన కానీ, ప్రయత్నం కానీ చేయలేదని ఆయన విమర్శించారు.
పరిశ్రమలు పారిపోయాయి, భూముల లాక్కున్నారు
గత ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా భయంతో పారిపోయాయని మంత్రి అనగాని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రజలను బెదిరించి భూములు లాక్కున్నారని ఆయన చెప్పారు. ప్రాధాన్యత ఇవ్వాల్సిన రాజధాని అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టని గత ప్రభుత్వం, రుషికొండ ప్యాలెస్ నిర్మాణం కోసం మాత్రం సుమారు ₹600 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.
Also Read: Mahaa Conclave: ‘కూటమి’ పాలనలో కొత్త ఊపు.. అంతర్జాతీయ గుర్తింపు
పరిశ్రమలకు భరోసా, ఉద్యోగ కల్పన
ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు నమ్మకాన్ని కల్పిస్తోందని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులు సైతం సంతోషంగా లేరని, కానీ తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లలా చూస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తూ, ప్రజలు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

