TGTET: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పాఠశాల విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2026 షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. ఏటా రెండుసార్లు టెట్‌ను నిర్వహించాలనే నిబంధనను పటిష్టంగా అమలు చేస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం. పూర్తి నోటిఫికేషన్ శుక్రవారం (నవంబర్ 14) విడుదల కానుంది.
దరఖాస్తు, పరీక్ష తేదీలు
ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, టెట్ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 15, 2025 (శనివారం)
దరఖాస్తుకు తుది గడువు: నవంబర్ 29, 2025
పరీక్షల నిర్వహణ: జనవరి 3, 2026 నుంచి జనవరి 31, 2026 వరకు
వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో ఈ పరీక్షలు సుదీర్ఘ కాలంలో జరుగుతాయి. ఈ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి.
Also Read: Punjab Terror Plot: పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
ప్రభుత్వ ఉపాధ్యాయులకూ టెట్ తప్పనిసరి
ఉపాధ్యాయ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ టెట్ పరీక్ష కీలకమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే టీచర్లుగా పనిచేస్తున్న వారంతా టెట్ పాస్ కావాల్సిన అవసరం ఉంది.
కాగా, ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధనను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిబంధనను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీని ఫలితంగా 2025లో తొలి విడత టెట్ జూన్‌లో నిర్వహించి, జులై 22న ఫలితాలు కూడా వెల్లడించారు. తాజాగా, ఇది రెండో విడత నోటిఫికేషన్‌గా విడుదలైంది.

