CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్ కంపెనీలు ముందుకు వచ్చాయి. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తైవాన్ ప్రతినిధి బృందం విశాఖపట్నంలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో పలు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకోవడానికి రంగం సిద్ధమైంది.
తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి, రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలో తైవాన్ బృందం ముఖ్యమంత్రిని కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం చాలా బాగుందని, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉందని తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని ప్రశంసించారు.
కుప్పంలో భారీ పారిశ్రామిక పార్కు
తైవాన్ కంపెనీల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్‌ను అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయత్నంలో భాగంగానే తైవాన్ కంపెనీలు ఇండో-తైవాన్ ఇండస్ట్రియల్ పార్కును కుప్పంలో ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపాయి.
అలీజియన్స్ గ్రూప్ ఈ పార్కును ₹400 కోట్ల వ్యయంతో 470 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా దాదాపు 50 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
Also Read: Minister Lokesh: ఏపీలో మరో భారీ పెట్టుబడి రెన్యూ పవర్: రూ.82 వేల కోట్ల పెట్టుబడికి లోకేశ్ ప్రకటన
బ్యాటరీ తయారీలో ₹18,000 కోట్ల పెట్టుబడి
పారిశ్రామిక కారిడార్లను వివిధ రంగాల్లోని ప్రాజెక్టులకు అనుకూలంగా తీర్చిదిద్దుతున్నామని తైవాన్ బృందానికి ముఖ్యమంత్రి వివరించారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ (ఈవీ), ఈవీ బ్యాటరీ వంటి అత్యాధునిక రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని తైవాన్ కంపెనీలను ఆయన ఆహ్వానించారు.
సీఎం ఆహ్వానం మేరకు తైవాన్‌కు చెందిన మిజోలి ఇండియా జేవీ, మిజోలి యూఎస్ఏ, క్రియేటివ్ సెన్సోర్, సినేస్టి టెక్నాలజీలు కలిసి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భారీ పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ కంపెనీలు ₹18 వేల కోట్ల వ్యయంతో 23 GWH ఫ్రికర్సర్, సింగిల్ క్రిస్టల్ కాథోడ్ యాక్టివ్ మెటీరియల్, సాలిడ్ స్టేట్ ఎలక్ట్రోలైట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మరో 2 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి.
ఈ కీలక ఒప్పందాలు ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ సాధించడంలో, ‘వికాసిత్ భారత్’ వైపు దేశాన్ని నడిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు, ఎల్లుండి విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసింది.
#CIIPartnershipSummit2025 #ChooseSpeedChooseAP
Ahead of the CII Partnership Summit in Visakhapatnam today, the Government of Andhra Pradesh signed two significant MoUs with leading Taiwanese companies, marking another step in strengthening the state’s industrial growth story.… pic.twitter.com/FQ683gKkqc— N Chandrababu Naidu (@ncbn) November 13, 2025

