Sania Mirza

Sania Mirza: తీవ్రమైన పానిక్ అటాక్ వచ్చింది.. శరీరమంతా వణికిపోయింది : సానియా మీర్జా

Sania Mirza: భారత టెన్నిస్ దిగ్గజం, మాజీ ప్రపంచ నంబర్ 1 డబుల్స్ క్రీడాకారిణి సానియా మీర్జా తన వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాలను తొలిసారిగా బహిరంగంగా పంచుకున్నారు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎదుర్కొన్న మానసిక సవాళ్లు, పానిక్ అటాక్ గురించిన ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. సానియా తన సన్నిహితురాలు, ప్రముఖ సినీ దర్శకురాలు ఫరా ఖాన్ నిర్వహించే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ఆ కష్ట కాలంలో తనకెదురైన సంఘటనలను భావోద్వేగంతో వివరించారు. విడాకుల ప్రక్రియ, ఆ తర్వాత వచ్చిన ఒత్తిడి నన్ను చాలా కుంగదీసిందని సానియా మీర్జా తెలిపారు. 2024 జనవరిలో షోయబ్ మాలిక్‌తో విడిపోయిన తర్వాత తాను తీసుకున్న నిర్ణయం ఎంత కఠినమైనదో ఆమె పంచుకున్నారు. ఒంటరి తల్లిగా నా కొడుకు ఇజాన్ బాగోగులు చూసుకోవడం, అదే సమయంలో నా కెరీర్ ఇతర బాధ్యతలను సమన్వయం చేసుకోవడం అనేది చాలా పెద్ద యుద్ధంలా అనిపించింది.

Also Read: Nitish Kumar Reddy: ఇండియా టెస్టు స్క్వాడ్ నుండి నితీష్ కుమార్ రెడ్డి ఔట్!

నేను ప్రతిరోజూ ఆ పోరాటంలో ఉండేదాన్ని అని సానియా కన్నీళ్లతో చెప్పారు. సమాజం నుంచి వచ్చే విమర్శలు, ఒంటరితనం తనపై తీవ్ర ప్రభావం చూపాయని, కొన్నిసార్లు పూర్తిగా నిస్సత్తువకు లోనయ్యేదాన్నని ఆమె వివరించారు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనను సానియా ఈ విధంగా గుర్తుచేసుకున్నారు.న “ఒకానొక రోజు నేను ఒక లైవ్ టెలివిజన్ షోలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాను. స్టేజ్‌పైకి వెళ్లడానికి కొద్ది నిమిషాల ముందు నాకు తీవ్రమైన పానిక్ అటాక్ వచ్చింది. నా శరీరమంతా వణికిపోతోంది, శ్వాస ఆడటం కష్టమైంది. నేను ఆందోళనతో గదిలో ఇటూ అటూ తిరగడం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఆ సమయంలో ఫరా ఖాన్ షూటింగ్ వదిలిపెట్టి, వెంటనే తన దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పారని, తనను సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడిందని సానియా కృతజ్ఞతాభావంతో తెలిపారు. ఫరా మద్దతు వల్లే తాను ఆ రోజు షోను పూర్తి చేయగలిగానని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దేశం కోసం అద్భుతాలు సాధించిన ఒక దిగ్గజ క్రీడాకారిణి కూడా ఇంతటి మానసిక సంఘర్షణను ఎదుర్కోవడం పట్ల అభిమానులు, ప్రముఖులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *