Delhi: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో భారత్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు తమ దేశం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
నెతన్యాహు బుధవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ “నా మిత్రుడు నరేంద్ర మోదీకి, ధైర్యవంతులైన భారత ప్రజలకు నేను, నా భార్య సారా, ఇజ్రాయెల్ ప్రజల తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్ మీ పక్కన నిలుస్తుంది,” అని పేర్కొన్నారు.
అలాగే ఆయన ఉగ్రవాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్నారు “ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయగలదేమో కానీ, మన ఆత్మలను మాత్రం ఎప్పటికీ కదిలించలేదు. మన దేశాల వెలుగు శత్రువుల చీకటిని మించి ప్రకాశిస్తుంది,” అని నెతన్యాహు స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ కూడా ఈ దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ కొనసాగుతుందని అన్నారు.

