TTD laddu ghee scam

TTD laddu ghee scam: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. మరోసారి సిట్‌ ముందు ధర్మారెడ్డి

TTD laddu ghee scam: తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం టీటీడీ చరిత్రలో పెద్ద వివాదంగా మారింది. ఈ కేసులో నిజానిజాలు బయటపెట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ వేగవంతంగా సాగుతోంది. గత రెండు రోజులుగా టీటీడీ మాజీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన నుండి పలు కీలక వివరాలు బయటకు వచ్చినట్లు సమాచారం.

సిట్‌ విచారణలో అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు ధర్మారెడ్డి సమాధానమివ్వలేదు. కొన్నింటికి మాత్రమే వివరణ ఇచ్చారు. ముఖ్యంగా కల్తీ నెయ్యి సరఫరా విషయం తెలిసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగినప్పుడు, “హైకమాండ్‌ ఒత్తిడితో అనుమతించాల్సి వచ్చింది” అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ హైకమాండ్‌ ఎవరో అడిగినప్పుడు మాత్రం మౌనం వహించారు.

సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ మైసూరు 2022 ఆగస్టులో ఇచ్చిన నివేదికలో భోలేబాబా, శ్రీ వైష్ణవి, ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ డెయిరీల నెయ్యిలో కల్తీ ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని సిట్‌ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అధికారులు “టీటీడీ కొనుగోళ్లలో నాణ్యత తనిఖీలు ఎంత తరచుగా జరుగుతాయి?”, “నిబంధనల ప్రకారం పాలు సేకరించే సంస్థలకే అనుమతి ఇవ్వాలని ఉన్నా, 2020లో ‘మిల్క్‌’ పదాన్ని ఎందుకు తొలగించారు?” వంటి ప్రశ్నలు కూడా వేశారు.

Also Read: Chandrababu: ఏపీలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం

సిట్‌ విచారణలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. భోలేబాబా డెయిరీ గత ఐదేళ్లలో తిరుమలకు 68.17 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసి, రూ.251 కోట్లకు పైగా సంపాదించినట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థ తమ పేరుతో పాటు శ్రీ వైష్ణవి, ఏఆర్‌, మాల్‌గంగా డెయిరీల పేర్లతో కూడా సరఫరాలు చేసినట్లు విచారణలో తేలింది. ఆ సంస్థ డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌లు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని సిట్‌ అధికారులు తెలిపారు.

ధర్మారెడ్డిని “వారిని ఎప్పుడైనా కలిశారా?” అని అడిగినప్పుడు “కాదు” అని సమాధానమిచ్చారని సమాచారం. నాణ్యతా నియంత్రణ, టెండర్‌ ఖరారులు, సరఫరా సంస్థల ఎంపికపై సిట్‌ అధికారులు సవివరంగా విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, మాజీ చైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. రేపు ఆయన విచారణకు హాజరుకానున్నారు. ఇదే సమయంలో తిరుమల పరకామణి చోరీ కేసుపై కూడా సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను దెబ్బతీస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తుల విశ్వాసానికి చారిత్రకమైన తితిదే లడ్డూ ప్రసాదం ఈ వివాదంతో మసకబారకుండా ఉండాలంటే దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా జరగాలని భక్తులు కోరుకుంటున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *