Vijay Deverakonda: ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ మంగళవారం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలలో నిషేధించబడిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వివాదంపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.
విచారణలో భాగంగా, నటుడు బెట్టింగ్ యాప్‌ల నుంచి ఎంత మొత్తం పారితోషికం తీసుకున్నారు, అలాగే వాటి నుంచి కమీషన్ల రూపంలో ఎంత పొందారు అనే విషయాలపై అధికారులు వివరాలు అడుగుతున్నట్టు సమాచారం. గతంలో ఈ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగానే విజయ్ దేవరకొండను విచారిస్తున్నారు.
నిజానికి, ఈ విషయంలో విచారణకు హాజరు కావాలంటూ విజయ్ దేవరకొండతో పాటు మరో నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కూడా సీఐడీ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలోనే అధికారులు ఈ ప్రచారకర్తలను కూడా విచారిస్తున్నారు.

