Kaantha: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో సారి విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాల తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక లెజెండరీ బయోపిక్‌గా తెరకెక్కుతోంది. తమిళ సినీ ప్రపంచంలో తొలి సూపర్ స్టార్‌గా పేరొందిన ఎం.కే. త్యాగరాజ భాగవతార్ జీవితమే ఈ సినిమా కథకు ఆధారంగా ఉన్నట్లు సమాచారం.
భాగవతార్ ఒక క్లాసికల్ సింగర్, నటుడు, సంగీతకారుడు. 1934లో ‘పావలక్కోడి’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, 1944లో ‘హరిదాస్’ చిత్రంతో అపార ఖ్యాతి సంపాదించారు. ఆ చిత్రం మద్రాస్‌లో మూడు సంవత్సరాల పాటు థియేటర్లలో ప్రదర్శించబడుతూ రికార్డులు సృష్టించింది. అయితే అదే సంవత్సరంలో ఒక హత్య కేసులో చిక్కుకోవడంతో ఆయన జీవితంలో తీవ్రమైన మలుపు తిరిగింది.
Also Read: Ravi Teja: రవితేజ ఊహించని నిర్ణయం.. రెమ్యునరేషన్ లేకుండా నటన!
సీ.ఎన్. లక్ష్మీకాంతన్ అనే జర్నలిస్టు హత్య కేసులో ఆయనతో పాటు ప్రముఖ హాస్య నటుడు ఎన్.ఎస్. కృష్ణన్, దర్శకుడు శ్రీరాములు నాయుడు అరెస్ట్ చేయబడ్డారు. తర్వాత న్యాయపరంగా నిర్దోషిగా బయటపడ్డా, ఆయన కెరీర్ మాత్రం తిరిగి పుంజుకోలేకపోయింది. జైలులో 30 నెలలు గడిపిన తర్వాత సినిమాల్లో అవకాశాలు రాలేదు. చివరికి సంగీత కచేరీలతోనే జీవితం గడిపారు. 1959లో డయాబెటిస్ సమస్యతో బాధపడుతూ త్యాగరాజ భాగవతార్ మరణించారు. ఆయన చివరి చిత్రం ‘శివగామి’ 1960లో విడుదలైంది. ఆయన మరణం తర్వాత మాత్రమే ప్రజలు ఆయన ప్రతిభను గుర్తించి గౌరవించారు.
ఈ అజ్ఞాత కథనాన్ని దుల్కర్ సల్మాన్ తన ప్రత్యేక నటనతో మరోసారి తెరపైకి తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ‘కాంత’ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దుల్కర్ కెరీర్‌లో మరో క్లాసిక్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

