Ande Sri: ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీ నిన్న సోమవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సాహితీ లోకం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఈ రోజు ఆయన అంతిమ యాత్రను భారీ ఎత్తున ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని లాలాపేట జయశంకర్ స్టేడియం నుంచి అందెశ్రీ అంతిమ యాత్ర మొదలైంది. ఈ యాత్ర తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ వరకు సాగనుంది. కడసారి తమ అభిమాన కవిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు, కళాకారులు యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందోహం చూస్తుంటే, ప్రజలపై అందెశ్రీ గారి ప్రభావం ఎంత ఉందో తెలుస్తోంది.
ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య అధికారిక లాంఛనాలతో ఆయనకు వీడ్కోలు పలకనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అందెశ్రీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఆయనకు పూర్తి గౌరవంతో వీడ్కోలు పలుకుతోంది.గుండెపోటుతోనే ఆయన మరణించి ఉండవచ్చునని వైద్యులు తెలిపారు.

