Richa Ghosh: భారత మహిళా క్రికెట్‌లో కొత్త చరిత్ర రాసిన రిచా ఘోష్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు విజయం సాధించగా, ఆ విజయానికి కీలక పాత్ర పోషించిన రిచాకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి విశేష గౌరవం లభించింది. సీఎం మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించిన ఈ సత్కారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయాన్ని అందించిన రిచా ఘోష్ పేరుతో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. డార్జిలింగ్‌లోని 27 ఎకరాల భూమిపై ఈ స్టేడియాన్ని నిర్మించాలని నిర్ణయించారు. “భవిష్యత్తులో రిచా ఘోష్ స్టేడియం పశ్చిమ బెంగాల్ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది” అని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
నిన్న సిలిగురిలో జరిగిన సన్మాన కార్యక్రమంలో రిచాను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సీనియర్ క్రికెటర్ జూలాన్ గోస్వామి తదితరులు హాజరయ్యారు. రిచా సత్కారం సందర్భంగా ఆమెకు రూ.34 లక్షల నగదు బహుమతి, బంగా భూషణ్ పురస్కారం, అలాగే రాష్ట్ర పోలీసు శాఖలో డీఎస్పీ హోదా కేటాయించారు. అంతేకాదు, బెంగాల్ ప్రభుత్వం ఆమెకు బంగారు గొలుసు, గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్‌లను బహుమతిగా ఇచ్చింది.
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్!
మమతా బెనర్జీ మాట్లాడుతూ, “రిచా కేవలం 22 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్ అయింది. ఆమె ప్రతిభ పశ్చిమ బెంగాల్ గర్వకారణం. భవిష్యత్తులో అనేకమంది యువతులు ఆమెను చూసి స్ఫూర్తి పొందుతారు” అన్నారు.
రిచా ఘోష్ 16 ఏళ్ల వయసులోనే భారత మహిళా జట్టులో అడుగుపెట్టింది. ఆమె తన బ్యాటింగ్‌తో క్రమంగా ఎదిగి, ఇప్పుడు టీమిండియా ముఖ్య ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది. గతంలో ఆమె ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం, CWG టోర్నీలో వెండి పతకం సాధించింది. అలాగే 2023 అండర్–19 టీ20 వరల్డ్‌కప్‌లోనూ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది.
ఇప్పుడేమో ప్రపంచకప్ విజేతగా రిచా ఘోష్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. ఆమె పేరిట స్టేడియం నిర్మాణం జరగడం, డీఎస్పీ హోదా లభించడం వంటి గౌరవాలు మహిళా క్రీడాకారిణుల కోసం కొత్త అధ్యాయం లాంటివి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

