Telangana Cabinet:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు వివిధ మార్గాల్లో ప్రయత్నించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. చివరకు దానిని కుదించేందుకే సిద్ధమైనట్టు తెలుస్తున్నది. 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కసరత్తును కూడా వేగవంతం చేసింది. దీనిలో భాగంగా నవంబర్ 12న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Telangana Cabinet:హైకోర్టు సూచించిన విధంగా 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. దానిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడా న్యాయం దక్కలేదు. హైకోర్టులోనే ఆ అంశాన్ని తేల్చుకోవాలని సూచించడంతో మరో మార్గం లేకుండాపోయింది. మరోవైపు రాష్ట్రపతి వద్ద ఆ అంశం ఇంకా పెండింగ్లోనే ఉన్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా భావిస్తున్నది.
Telangana Cabinet:ఇదిలా ఉండగా రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ హైకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే అంతకు ముందే ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. కోర్టు సూచించిన విధంగా తమకు రిజర్వేషన్ల జాబితాను అందించాలని ఆ లేఖలో పేర్కొన్నది. దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సర్కారు నిర్ణయం కోసమే ఎన్నికల సంఘం ఎదురు చూస్తున్నది.
Telangana Cabinet:ఇలాంటి తరుణంలో నవంబర్ 12న జరిగే క్యాబినెట్ భేటీలో పాత విధానంలోనే (50శాతం) స్థానిక ఎన్నికల నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనున్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను మరోసారి కలెక్టర్ల ద్వారా ఖరారు చేయనున్నది. అనంతరం ఆ జాబితాను ఎన్నికల సంఘానికి అందజేయనున్నది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి, ఇదే నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేలా కసరత్తు సాగుతున్నది. డిసెంబర్ 20లోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు తెలుస్తున్నది.

