Mamata Banerjee:అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవికి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గట్టి మద్దతు ప్రకటించారు. గంగూలీని ఐసీసీ అధినేతగా నియమించాలని ఆమె స్పష్టం చేశారు. దాదా లాంటి అర్హతలున్న వ్యక్తిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని దీదీ ధీమా వ్యక్తం చేశారు.
శనివారం (నవంబర్ 8, 2025) ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “సౌరవ్ గంగూలీ కేవలం ఒక ఆటగాడు కాదు, బెంగాల్ గర్వకారణం. ఆయన దేశానికి, ప్రపంచానికి, బెంగాల్‌కి అపారమైన సేవ అందించారు. మేము ఎప్పుడూ సౌరవ్‌ని చాలా కాలం కెప్టెన్‌గా చూడాలనుకున్నాం.
ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతో తెలుసా?
ఇప్పుడు నా మాట వినండి… ఐసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి? సౌరవ్ గంగూలీ తప్ప మరొకరు కాదు” అని అన్నారు. “ఈరోజు ఆయన ఆ స్థానంలో లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఆయనను ఆపడం అంత సులభం కాదు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
గంగూలీని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన సమయంలో కూడా మమతా బెనర్జీ బహిరంగంగా మద్దతు పలికారు. గంగూలీకి ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె అప్పట్లో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

