Vivek Venkatswamy: తెలంగాణ రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయి. వారి సంక్షేమం, రక్షణ మరియు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని త్వరలోనే అమలులోకి తీసుకురాబోతున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.
తాజాగా, సచివాలయంలో అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లు మరియు కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లును ఈ నెల 12వ తేదీన జరగబోయే మంత్రిమండలి సమావేశంలో ఆమోదం పొందుతుందని తెలిపారు. మంత్రిమండలి ఆమోదం తర్వాత, ఈ బిల్లును వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని, శాసనసభ ఆమోదం లభించిన వెంటనే ఈ చట్టం అమలులోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఈ బిల్లులో గిగ్ వర్కర్లకు మరింత మేలు జరిగేలా ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే, ప్రభుత్వం ఆ అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తుందని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. అలాగే, గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేసే విషయంపై కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయంలో అగ్రిగేటర్లతో మాట్లాడి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా అవసరమైతే మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు మెరుగైన భద్రత మరియు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందనే విశ్వాసం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
