Dk shivakumar: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందన్న వార్తలపై ఉప ముఖ్యమంత్రి డీ.కె. శివకుమార్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనేది అసత్యమని ఆయన ఖండించారు.
“పార్టీ గీతను నేను ఎప్పుడూ దాటను. నవంబర్ విప్లవం ఉండదు, డిసెంబర్ లేదా జనవరిలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. 2028లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది,” అని ధీమాగా చెప్పారు.
తన ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ లేదా ముఖ్యమంత్రి మార్పుపై ఎవరితోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. “నాయకత్వ మార్పు గురించి నేను ఏమీ చెప్పలేదు. సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తి పదవీ కాలం కొనసాగుతారు. ఢిల్లీ నాయకులు ఏం చెబితే, అదే చేస్తాం,” అని అన్నారు.
కర్ణాటకలో సిద్ధరామయ్య–డీకే శివకుమార్‌ల మధ్య రెండున్నరేళ్ల చొప్పున పదవీ విభజన జరుగుతుందన్న ప్రచారం చాలాకాలంగా వినిపిస్తోంది. సిద్ధరామయ్య పదవీకాలం సగానికి చేరుతుండటంతో, శివకుమార్ సీఎం కుర్చీపై కన్నేశారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ వాదనలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు.
“పార్టీ నాకు ఎన్నో బాధ్యతలు అప్పగించింది. బీహార్ ఎన్నికల బాధ్యతలు కూడా నాకు ఇచ్చారు. మరెవరో కారణం లేకుండా ‘విప్లవం’ అనే పదం వాడుతున్నారు,” అని చెప్పారు.
డీకే శివకుమార్ మాట్లాడుతూ పార్టీ పట్ల క్రమశిక్షణతో ఉంటానని, కాంగ్రెస్ సూత్రాలకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.

