Pok: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో మరోసారి ఆందోళనలు రగిలాయి. ఈసారి ఉద్యమానికి జెన్-జీ విద్యార్థులు నాయకత్వం వహిస్తున్నారు. అధిక ఫీజులు, డిజిటల్ మార్కింగ్ విధానంపై విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం, ముజఫరాబాద్ విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమైన ఈ నిరసనలు, క్రమంగా ఇతర విద్యాసంస్థలకు వ్యాపించాయి. సెమిస్టర్ ఫీజుల పేరుతో మూడు, నాలుగు నెలలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన డిజిటల్ అసెస్‌మెంట్ సిస్టమ్ (ఈ-మార్కింగ్) కారణంగానే ఫలితాల్లో అన్యాయం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. కొందరు పరీక్షలకు హాజరుకాకపోయినా పాస్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఆగ్రహం మరింత పెరిగింది.
ప్రారంభంలో శాంతియుతంగా సాగిన ఈ ఆందోళన, ఇటీవల హింసాత్మక రూపం దాల్చింది. నిరసనకారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన విద్యార్థులు టైర్లకు నిప్పు పెట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఓకేలో చోటుచేసుకుంటున్న ఈ విద్యార్థి ఉద్యమం, ఇటీవల బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన విద్యార్థుల ఉద్యమాలను గుర్తుచేస్తోంది.
పీఓకేలో పెరుగుతున్న ఈ అసంతృప్తి, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.

