Miss Universe: థాయ్‌లాండ్ (Thailand) లో జరుగుతున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలు (Miss Universe 2025)లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఆతిథ్య దేశానికి చెందిన ఒక అధికారి మరియు మిస్ మెక్సికో మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ సంఘటన ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ ద్వారా ప్రసారం కావడంతో కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
వివాదం ఎలా మొదలైంది?
మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్ నవాత్ ఇత్సారగ్రిసిల్ (Navat Itsaragrisil), మిస్ మెక్సికో ఫాతిమా బాష్ (Fatima Bash) ఒక షూట్‌కు హాజరుకాలేదని విమర్శించారు. అంతే కాకుండా ఆమెను ఇతర పోటీదారుల ముందు “డమ్మీ (తెలివితక్కువ)” అని పిలిచారని సమాచారం.
దీంతో ఫాతిమా బాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “నేను ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మీరు మమ్మల్ని గౌరవించినట్లే మేం మిమ్మల్ని గౌరవిస్తాం. నా సంస్థతో మీకు సమస్య ఉంటే నన్ను దానిలోకి లాగకండి” అని బహిరంగంగా తిరగబడ్డారు. వాకౌట్ చేసిన పోటీదారులు
ఈ వాగ్వాదం జరుగుతున్న సమయంలో మరికొన్ని దేశాలకు చెందిన కంటెస్టెంట్లు నిరసనగా వేదికను వదిలి వెళ్లారు. కొందరు నవాత్‌పై అరుస్తూ, “మహిళలను గౌరవించండి” అని డిమాండ్ చేశారు.
మిస్ డెన్మార్క్ విక్టోరియా థైల్విగ్ మాట్లాడుతూ, “మరొక మహిళను అందరి ముందు అవమానించడం అసహ్యకరమైనది. అందుకే నేను నా కోటు తీసుకొని బయటకు వెళ్తున్నాను”అని తెలిపారు.
మిస్ యూనివర్స్ సంస్థ స్పందన
ఈ ఘటనపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ (MUO) అధికారిక ప్రకటన విడుదల చేసింది. సంస్థ అధ్యక్షురాలు రౌల్ రోచా మాట్లాడుతూ, “మహిళల పట్ల గౌరవం మరియు మర్యాద అనే విలువలను ఎవరూ ఉల్లంఘించకూడదు. హోస్ట్‌గా నవాత్ తన బాధ్యతను మరచిపోయాడు” అని వ్యాఖ్యానించారు. అలాగే ఆయనపై కార్పొరేట్ మరియు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు.
నవాత్ క్షమాపణలు
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నవాత్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. “ఎవరైనా నా మాటల వల్ల బాధపడితే క్షమించండి. ఆ రోజు ఒత్తిడిలో ఉన్నాను”అని వివరణ ఇచ్చారు.
ఫాతిమా బాష్ స్పందన
తరువాత ఒక ఇంటర్వ్యూలో ఫాతిమా బాష్ మాట్లాడుతూ, “నేను కేవలం అందం కోసం ఇక్కడ లేను. నాకు గొంతు ఉంది, ఉద్దేశ్యం ఉంది. నా దేశం, నా మహిళల కోసం మాట్లాడుతాను” అని అన్నారు.
పోటీపై ప్రభావం
ఈ వివాదం కారణంగా 74వ మిస్ యూనివర్స్ పోటీలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. అయితే నిర్వాహకులు కార్యక్రమాన్ని ఆపకుండా కొనసాగించారు. విజేతకు నవంబర్ 21న బ్యాంకాక్‌లో కిరీటం ప్రదానం కానుంది.

