Coimbatore Gang Rape: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో జరిగిన దారుణమైన సామూహిక అత్యాచార ఘటనపై రాజకీయ దుమారం రేగింది. అధికార డీఎంకే మిత్రపక్షానికి చెందిన ఒక నాయకుడు బాధితురాలిపైనే నిందలు వేస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీయగా, దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది.
డీఎంకే మిత్రపక్షమైన కొంగు నాడు మక్కల్ కచ్చి పార్టీ నేత ఈ.ఆర్. ఈశ్వరన్ ఈ కేసు గురించి మాట్లాడుతూ, “ఆ అమ్మాయి రాత్రి వేళ బయట ఎందుకు ఉండాల్సి వచ్చింది?” అన్నట్లుగా ప్రశ్నించడంపై రాజకీయ వర్గాలు భగ్గుమన్నాయి. ఈ వ్యాఖ్యలు బాధితురాలిపైనే నిందలు వేసే ధోరణిని సూచిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read: Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్.. జూబ్లీహిల్స్‌లో గ్రామస్థాయి అభివృద్ధి కూడా లేదు!
ఈశ్వరన్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై, డీఎంకే మిత్రపక్ష నేత చేసిన వ్యాఖ్యలను వీడియోతో సహా సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఇవి “ప్రమాదకరమైన వైఖరి” అని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, డీఎంకే పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ, ఏఐఏడీఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఇటీవల కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 21 ఏళ్ల పీజీ విద్యార్థిని, ఆమె స్నేహితుడిపై దాడి చేసి, దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవగా, పోలీసులు వేగంగా స్పందించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో అరెస్టు చేశారు. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనను అమానవీయ చర్యగా ఖండించారు. నిందితులకు గరిష్ట శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, ఒక నెలలోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు.

