Drugs Overdose: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తున్నట్లు బయటపడింది. పాతబస్తీకి చెందిన అహ్మద్ అలీ (28) అనే యువకుడు డ్రగ్స్ ఓవర్‌డోస్ కారణంగా మృతి చెందాడు. కర్నూలు జిల్లాకు చెందిన తన ప్రేయసితో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న అహ్మద్ శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్లో నివసిస్తూ మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
ఓవర్డోస్తో విషాదం
నవంబర్ 5 రాత్రి అహ్మద్, అతని స్నేహితుడు, కర్నూలు యువతి, అలాగే కోల్‌కతాకు చెందిన మరో యువతి కలిసి రూమ్‌లో పార్టీ చేసుకున్నారు.
సమాచారం ప్రకారం, నిలోఫర్ కేఫ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి ఫ్లాట్‌లోకి వచ్చిన తర్వాత వాటిని సేవించారు. రాత్రి డ్రగ్స్ మోతాదు ఎక్కువై అహ్మద్ రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అదే సమయంలో ప్రేయసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
అహ్మద్ పరిస్థితి విషమించడంతో భయపడ్డ స్నేహితుడు 108 అంబులెన్స్‌కి కాల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అప్పటికే అహ్మద్ మరణించగా, యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో యువతి పారిపోవడానికి యత్నించగా, పోలీసులు ఆమెను వెంబడించి పట్టుకున్నారు.
డ్రగ్స్ టెస్ట్‌లో ముగ్గురికి పాజిటివ్
పోలీసులు చేసిన డ్రగ్స్ టెస్ట్‌లో ముగ్గురికీ పాజిటివ్‌గా తేలింది. ఘటనపై అనుమాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ప్రస్తుతం డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఆగని డ్రగ్స్ మాఫియా
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈగల్ టీమ్ ఏర్పాటు చేసినప్పటికీ, నగరంలో డ్రగ్స్ కల్చర్ ఇంకా చెలరేగుతూనే ఉంది. తరచూ వివిధ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. శివరాంపల్లిలో జరిగిన తాజా ఘటన మరోసారి డ్రగ్స్ మహమ్మారి తీవ్రతను బయటపెట్టింది.
పోలీసులు హెచ్చరిస్తూ “డ్రగ్స్ వినియోగం కేవలం నేరం మాత్రమే కాదు, జీవితాన్ని బలి తీసుకునే వ్యసనం” అని తెలిపారు.
పోలీసుల హెచ్చరిక:
యువత డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి సంఘటనలు కుటుంబాలను కుదిపేస్తున్నాయి. డ్రగ్స్ కొనుగోలు, వినియోగం లేదా సరఫరా చేసిన వారిని చట్టం కఠినంగా శిక్షిస్తుంది అని తెలిపారు.

