New Districts in AP

New Districts in AP: కొత్త జిల్లాలతో పాటూ కొత్త నియోజకవర్గాలు కూడా..?

New Districts in AP:  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సర్దుబాటు అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. మంత్రివర్గ ఉపసంఘం ఈ మార్పులపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించారు. అప్పటి వరకు 26 పార్లమెంట్ స్థానాలు, 187 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2009 నాటికి వాటిని 25 పార్లమెంట్‌ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు తగ్గించారు. ఇప్పుడు 2029 ఎన్నికల నాటికి పార్లమెంట్ స్థానాలతో పాటు, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగనుందని ప్రచారం జరుగుతోంది. వీటితో పాటూ రిజర్వేషన్లలో మార్పులు రావడం, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు వంటి అంశాలు 2029 ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.

Also Read: Bihar Assembly Elections: బీహార్ ఎన్నికలు 2025: తొలి దశ పోలింగ్ ప్రారంభం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26కు పెంచి, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పునర్విభజించింది. దీనిపై అప్పట్లోనే అభ్యంతరాలు రావడంతో, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమయంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై కసరత్తు పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసింది. కొన్ని నియోజకవర్గాలను పక్క జిల్లాల్లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఉదాహరణకు, గన్నవరం, నూజివీడు స్థానాలను ఎన్టీఆర్ జిల్లాలోకి, కైకలూరును కృష్ణా జిల్లాలోకి కలపాలని సూచనలు ఉన్నాయి. విజయవాడలో భాగమైన పెనమలూరును కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలని భావిస్తున్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు జిల్లాలు కొత్తగా రానున్నాయి. మొదట 6 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నా, ఇప్పుడు రెండింటికే పరిమితం చేసినట్లు గట్టి టాక్‌ నడుస్తోంది. అదనంగా గిద్దలూరు, మడకశిర, అద్దంకి, పీలేరు రెవెన్యూ డివిజన్లుగా మారనున్నాయి. ఇక అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు అన్నది పార్లమెంట్ నియోజకవర్గాలతో ముడిపడి ఉండటంతో, ఉపసంఘం ఈ అంశంపై ప్రతిపాదనలు చేయడం లేదట. ఈ నెల 10న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదనలన్నింటిపైనా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి నాటికి ప్రక్రియ పూర్తి చేసి, జనవరి నుంచి కొత్త జిల్లాలు అమలులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఈ మార్పులపై ప్రజా స్పందన ఎలా ఉండనుందో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *