Rain Alert: మొంథా తుఫాను ప్రభావం తగ్గిన తరువాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొంత ఉపశమనం దొరికినప్పటికీ, ఇప్పుడు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. దీనికి కారణం కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఈ రోజు మధ్యాహ్నం నుంచి కొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేశారు. హైదరాబాద్‌లో కూడా తేలికపాటి వర్షం కురవనుంది. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నల్గొండ, వనపర్తి, గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. అయితే, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో, అలాగే హైదరాబాద్‌లో కూడా గురువారం నుంచి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

