Chevella Road Accident:

Chevella Road Accident: “నిన్ను త‌లెత్తుకునేలా చేస్తం నాయ‌నా.. అని లోకం విడిచే వెళ్లారు” చేవెళ్ల బ‌స్సు ప్ర‌మాదంలో క‌న్నీటి గాథ‌

Chevella Road Accident: చేవెళ్ల బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతుల కుటుంబాల‌ది ఒక్కొక్క‌రిదీ ఒక్కో క‌న్నీటి గాథ‌. పిల్ల‌ల‌ను కోల్పోయిన త‌ల్లిదండ్రులు, త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్ల‌లు, భార్య‌ను కోల్పోయిన భ‌ర్త‌, భ‌ర్త‌ను కోల్పోయిన భార్య.. ఇలా ఒక్కొక్క‌రిదీ ఒక్కో విషాద‌గాథ‌. ఇది ఏ ఒక్క‌రూ తీర్చేది కాదు. జీవితాంత అనుభ‌వించే శోకం. ఇలాంటి వారిలో వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణంలోని గాంధీన‌గ‌ర్‌కు చెందిన ఎల్ల‌య్య‌గౌడ్, అంబిక‌ దంప‌తుల‌ది విషాద‌గాథ‌. వారి ముగ్గురు కూతుళ్లు బస్సు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌యి తీర‌ని శోకం మిగిల్చారు.

Chevella Road Accident: ఆ ముగ్గురు యువ‌తులైన త‌నూష‌, సాయిప్రియ‌, నందిని ముగ్గురూ హైద‌రాబాద్ కోఠిలో ఉన్న చాక‌లి ఐల‌మ్మ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్నారు. ఇటీవ‌ల వారి బంధువుల ఇంటిలో జరిగిన ఓ శుభకార్యం కోసం వ‌చ్చి, మ‌ళ్లీ కాలేజీకి వెళ్లేందుకు తాండూరులో హైద‌రాబాద్ వెళ్లే బ‌స్సు ఎక్కి వెళ్తుండగా ఈ ప్రమాదం జ‌రిగింది. ఇప్పుడు ఎల్ల‌య్య దంప‌తులు ఆ ముగ్గురు కూతుళ్ల‌ను త‌లుచుకొని విల‌పిస్తుంటే ఏడ‌వ‌ని వారంటే లేరంటే అతిశ‌యోక్తి కాదు.

Chevella Road Accident: నిన్ను స‌మాజంలో త‌లెత్తుకునేలా చేస్తాం నాయ‌నా.. అని చెప్పి తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారంటూ గుండెల‌విసేలా ఎల్ల‌య్య‌గౌడ్ దంప‌తులు రోదించ‌సాగారు. మంచి ఉద్యోగం వ‌చ్చాక నిన్ను, అమ్మ‌ను హైద‌రాబాద్ తీసుకెళ్లి బాగా చూసుకుంటామ‌ని, ముగ్గురూ ఒకే బ‌స్సెక్కి మ‌ళ్లీ తిరిగిరాలేద‌ని వెక్కి వెక్కి ఏడుస్తుంటే చూసిన బంధుమిత్రులు, గ్రామ‌స్థుల నుంచి వెల్లువ‌లా క‌న్నీరు కార‌సాగింది.

Chevella Road Accident: నా ముగ్గురు కూతుళ్లు బాగా చ‌దివి న‌న్ను గ‌ర్వంగా బ‌తికేలా చేస్తామ‌ని చెప్పేవార‌ని ఎల్ల‌య్య‌గౌడ్ దంప‌తులు చెప్పారు. తాను డ్రైవింగ్‌కు వెళ్లిన‌ప్పుడు చాయ్ కూడా తాగేవాడిని కాద‌ని, చాయికి పెట్టే ఆ 10 రూపాయ‌లు ఉంటే పెన్ను, 20 రూపాయ‌లు ఉంటే నా బిడ్డ‌ల‌కు ఒక పుస్త‌కం కొనొచ్చు అని అనుకునేవాడిన‌ని త‌న కూతుళ్ల‌ను త‌లుచుకుంటూ ఎల్లయ్య‌గౌడ్ దుఃఖిస్తుంటే.. అనున‌యించ‌లేక అక్కడికి వ‌చ్చిన వారంద‌రూ దుఃఖ‌సాగ‌రంలోనే మునిగిపోయారు.

Chevella Road Accident: నేను పాత చొక్కా వేసుకుంటే నా చిన్న‌బిడ్డ తిట్టేద‌ని, కొత్త చొక్కా వేసుకోమ‌ని, త‌ల దువ్వి, బొట్టు పెట్టి పంపించేది.. మంచి సంబంధం చూసి ఘ‌నంగా వారి పెళ్లి చేద్దాం అనుకున్నా.. కానీ ముగ్గురినీ ఒకే పాడెపై ఎక్కించి, జిల్లేడు చెట్టుకు పెళ్లి చేస్తాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు.. అంటూ గుండెల‌విసేలా రోదించిన తండ్రిని చూసి అక్క‌డి వారు విల‌విల్లాడిపోయారు. ఇలా ఆ కుటుంబం జీవితాంతం విషాదంలోనే నిండిపోయేలా ఆ దేవుడు ఎందుకిలా చేశాడంటూ అంద‌రూ బాధ‌ప‌డ‌సాగారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *