YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో చేపట్టనున్న పర్యటనపై పోలీసులు కొన్ని కీలకమైన షరతులను విధించారు. మొంథా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలైన గూడూరు మండలం పరిధిలోని రామరాజు పాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్. గొల్లపాలెం గ్రామాలలో జగన్ పర్యటించనున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని, శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ అనుమతిని షరతులతో కూడినదిగా పోలీసులు తెలిపారు.
పోలీసుల ఆదేశాల ప్రకారం, ఈ పర్యటనకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే, హైవేపై ప్రజలు గుమికూడటం, సమావేశాలు నిర్వహించడంపై పూర్తిగా నిషేధం విధించారు. హైవేపై ప్రయాణించే వాహనాలకు, సాధారణ ప్రజలకు ఎక్కడా కూడా ఎలాంటి అంతరాయం కలిగించకూడదు అని స్పష్టం చేశారు. పర్యటన కేవలం పైన పేర్కొన్న నాలుగు గ్రామాలలో మాత్రమే జరగాలని పోలీసులు ఆదేశించారు.
ఇక, ఈ పర్యటనలో కాన్వాయ్‌లో పది వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, అలాగే 500 మందికి మించి ప్రజలు గుమికూడరాదని పోలీసులు పరిమితి విధించారు. అంతేకాకుండా, బైక్ ర్యాలీలకు, డీజేల వినియోగానికి అస్సలు పర్మిషన్ లేదని తెలిపారు. ఒకవేళ నిర్ణయించిన పరిమితిని దాటినా, అనుమతిని అతిక్రమించినా వెంటనే కార్యక్రమాన్ని రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ పర్యటనలో ఏమైనా ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగితే, దానికి పూర్తి బాధ్యత కార్యక్రమ నిర్వాహకులదే అవుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

