Brand Value

Brand Value: ఒక్క విజయం.. ఉమెన్ క్రికెటర్ల జీవితాలను మార్చేశాయి.. పెరిగిన బ్రాండ్ వ్యాల్యూ

Brand Value: నిన్నటి వరకు “అమ్మాయిల క్రికెట్టా? హా చూద్దాం లే..” అనే నిర్లక్ష్య ధోరణి అభిమానుల్లో కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. “మేమేం తక్కువ కాదు” అని భారత మహిళా జట్టు ప్రపంచానికి చూపించింది.

సెమీఫైనల్లో మెన్స్ టీమ్స్ కూడా చేజ్ చేయలేని స్కోర్‌ను జెమీమా రోడ్రిగ్స్ ఆధ్వర్యంలో ఛేజ్ చేయడం, ఫైనల్లో స్ట్రాంగెస్ట్ టీమ్ అయిన దక్షిణాఫ్రికాను మట్టికరిపించడం  ఇవన్నీ మహిళా క్రికెట్‌కు కొత్త యుగాన్ని తెచ్చాయి. భారత మహిళా జట్టు తొలిసారిగా వరల్డ్‌కప్ విజేతలుగా నిలవడం, కేవలం ట్రోఫీ గెలుపే కాదు  వారి భవిష్యత్తును, బ్రాండ్ విలువను కూడా కొత్త ఎత్తులకు చేర్చింది.

25% నుండి 100% వరకు పెరిగిన బ్రాండ్ విలువ

వరల్డ్‌కప్ విజయం తర్వాత మహిళా క్రికెటర్లపై కంపెనీల దృష్టి అమాంతం పెరిగింది. బేస్‌లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా ప్రకారం  “ఉదయం నుంచి బ్రాండ్ విచారణలతో ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. కొత్త ఎండార్స్‌మెంట్స్ మాత్రమే కాదు, పాత ఒప్పందాల రీనెగోషియేషన్‌ కూడా ప్రారంభమైంది.” ప్రస్తుతం మహిళా క్రికెటర్ల బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు 25% నుండి 100% వరకు పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

జెమీమా రోడ్రిగ్స్ – రికార్డులతో పాటు రెమ్యునరేషన్ డబుల్

ఆస్ట్రేలియాపై సెమీస్‌లో 127 నాటౌట్ స్కోర్ చేసిన జెమీమా రోడ్రిగ్స్ ఇప్పుడు బ్రాండ్‌లకు హాట్ ఫేవరెట్. JSW స్పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ ప్రకారం, “మ్యాచ్ పూర్తయిన వెంటనే 10-12 విభాగాల బ్రాండ్‌ల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి.” ప్రస్తుతం జెమీమా ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ.75 లక్షల నుండి రూ.1.5 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

స్మృతి మంధాన – ఇప్పటికే 16 బ్రాండ్‌ల ఫేస్

భారత మహిళా క్రికెట్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న స్మృతి మంధాన ఇప్పటికే HUL, నైక్, హెర్బాలైఫ్, హ్యుందాయ్, SBI, గల్ఫ్ ఆయిల్, PNB మెట్లైఫ్ వంటి 16 బ్రాండ్‌ల అంబాసడర్. ప్రతి బ్రాండ్ నుండి ఆమె రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా.

సోషల్ మీడియా ప్రభావం – ఫాలోవర్లలో త్రిబుల్ గ్రోత్

హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ వంటి ప్లేయర్ల సోషల్ మీడియా ఫాలోయింగ్ రెండు, మూడు రెట్లు పెరిగింది.
కంపెనీలు ఇప్పుడు ఈ క్రికెటర్లను “యువతలో ప్రభావం చూపగల ఫేసెస్”గా టార్గెట్ చేస్తున్నాయి.

బ్రాండ్‌లు క్యూలో

హిందుస్తాన్ యూనిలీవర్, ప్యూమా, పెప్సీ, స్విగ్గీ, రెక్సోనా, సర్ఫ్ ఎక్సెల్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే మహిళా జట్టును అభినందిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టులు షేర్ చేశాయి. “మైదాన్ కనిపించే, ఉన్నతంగా నిలబడే ప్రతి స్త్రీకి ఇది గెలుపు” అనే సర్ఫ్ ఎక్సెల్ సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది.

గెలుపు కంటే గొప్ప మార్పు

భారత మహిళా జట్టు వరల్డ్‌కప్ విజయం కేవలం క్రీడా చరిత్రలో ఒక మైలురాయి కాదు  భారత మహిళా క్రీడాకారిణుల విలువను గుర్తించిన సమాజానికి ఒక స్పష్టమైన సంకేతం. ఇక మీదట అమ్మాయిల మ్యాచ్ అంటే “చూద్దాం లే” కాదు  “మిస్ చేసుకోలేం” అనేది కొత్త స్లోగన్.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *