TV Actress: కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించే ఓ ప్రముఖ నటిని ఫేస్‌బుక్ వేదికగా లైంగికంగా వేధించిన కేసులో బెంగళూరు పోలీసులు కీలక అరెస్ట్ చేశారు. అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు నవీన్ కె మోన్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుమారు మూడు నెలల క్రితం ‘నవీన్జ్’ అనే ఫేస్‌బుక్ ఖాతా నుంచి 41 ఏళ్ల ఆ నటికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె ఆ రిక్వెస్ట్‌ను తిరస్కరించినప్పటికీ, నిందితుడు మెసెంజర్ ద్వారా రోజూ అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించాడు. అసభ్య సందేశాలతో పాటు, తన మర్మాంగాల వీడియోలను కూడా పంపినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నటి అతడిని బ్లాక్ చేసినా వేధింపులు ఆగలేదు. నిందితుడు నవీన్ నకిలీ ఖాతాలు (Fake Accounts) సృష్టించి వాటి ద్వారా అసభ్య సందేశాలు, వీడియోలు పంపుతూనే ఉన్నాడు. దీంతో మానసిక క్షోభకు గురైన నటి పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు ఒక అంతర్జాతీయ టెక్నాలజీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తేలింది.

