Chevella Road Accident:రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోరమైన బస్సు ప్రమాదం కారణంగా మరణించిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మరణించిన వారితో పాటు, మరికొందరు ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, చనిపోయిన వారందరి మృతదేహాలకు ఒకే చోట పోస్ట్‌మార్టం నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం మృతదేహాలన్నింటినీ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ పోస్ట్‌మార్టం ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి, ఉస్మానియా ఆస్పత్రి వైద్యులతో పాటు గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ వైద్యులు కూడా ఇందులో పాల్గొనాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రి నుంచి వైద్య బృందం ఉస్మానియాకు చేరుకుంది.
మరోవైపు, ఈ ప్రమాదంలో గాయపడిన వారికోసం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేశారు. ఏ సమయంలో బాధితులు వచ్చినా వారికి మెరుగైన చికిత్స అందించడానికి తమ వైద్యుల బృందం పూర్తిగా సిద్ధంగా ఉందని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

