Chevella Accident: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని కన్నీటిపర్యంతం చేసింది. సోమవారం తెల్లవారుజామున అతి వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టడంతో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక మూడు నెలల చిన్నారి ఉన్నారు.
ఈ ప్రమాదంలో అత్యంత హృదయ విదారక దృశ్యం తల్లీబిడ్డల మృతి. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా పడుకున్న మూడు నెలల చిన్నారి, ప్రమాద ధాటికి తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలింది. రోడ్డుపై పక్కపక్కనే విగత జీవులుగా పడి ఉన్న ఆ తల్లీబిడ్డల దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసి, కంటతడి పెట్టిస్తుంది.
Also Read: Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!
ప్రమాద వివరాలు :
షాద్‌నగర్ వైపు నుంచి కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి, తాండూర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును మీర్జాగూడ దగ్గర టర్నింగ్ పాయింట్‌లో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. టిప్పర్ ఓవర్ స్పీడ్ వల్లే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు, వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు, బస్సులోని కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీసి, హుటాహుటిన చేవెళ్ల, వికారాబాద్ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

