Telangana

Telangana: తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం నేటి (సోమవారం, నవంబర్ 3) నుంచి స్తంభించిపోనుంది. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ, రాష్ట్రంలోని 1,840 ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక సమ్మెకు దిగాయి. ఈ నిర్ణయంతో డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, బీఈడీతో సహా అన్ని రకాల వృత్తి విద్యా కళాశాలలు మూతపడనున్నాయి.

రూ. 9,000 కోట్ల బకాయిలు, చర్చలు విఫలం
గత నాలుగేళ్లుగా ప్రభుత్వం తమకు దాదాపు రూ. 9,000 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ప్రైవేట్ విద్యా సంస్థల మేనేజ్‌మెంట్ల సంఘం (FATHE) ఇతర యాజమాన్యాల సమాఖ్యలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ బకాయిల కారణంగా సిబ్బందికి, లెక్చరర్లకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నామని, కాలేజీలను నడపడం కష్టంగా మారిందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారులతో చర్చలు జరిపినప్పటికీ, ప్రభుత్వం కేవలం రూ. 150 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని చెప్పడంతో, ఈ మొత్తం తమకు ఏ మాత్రం సరిపోదని యాజమాన్యాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించాయి. బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు తాము కాలేజీలను తెరవబోమని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి.

Also Read: CM Revanth Reddy: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

విద్యార్థులపై తీవ్ర ప్రభావం, పరీక్షలు వాయిదా
ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనగా తీసుకున్న ఈ నిరవధిక బంద్ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే ఈ సమ్మె కారణంగా జేఎన్‌టీయూ ఫార్మసీ సెమిస్టర్, ఇంజినీరింగ్ ఇంటర్నల్, బీఈడీ వంటి ముఖ్యమైన పరీక్షలు వాయిదా పడ్డాయి. యాజమాన్యాలు ఆదివారం నుంచే బంద్ గురించి విద్యార్థులకు సమాచారం అందించాయి. ఏఐఎస్‌ఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు సైతం ఈ బంద్‌కు మద్దతు పలకడంతో, విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని యాజమాన్యాలు కోరాయి.

గతంలో కూడా బంద్‌కు పిలుపునిచ్చినప్పుడు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వాయిదా వేసిన యాజమాన్యాలు, ఈసారి మాత్రం హామీని నమ్మకుండా రోడ్డుకెక్కాయి. ప్రభుత్వం స్పందించకుంటే తమ పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. ఇందులో భాగంగా, నవంబర్ 4వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి తమ సమస్యలను వివరిస్తూ రిప్రజెంటేషన్లు సమర్పించనున్నారు. ఆ తర్వాత, నవంబర్ 6వ తేదీన లక్ష మంది ప్రైవేట్ కాలేజీల లెక్చరర్లు, సిబ్బందితో కలిసి భారీ సభను ఏర్పాటు చేయబోతున్నట్లు జేఏసీ ప్రకటించింది. విజిలెన్స్ దాడులు చేసినా తాము వెనక్కి తగ్గేది లేదని యాజమాన్యాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *