Telangana:ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫతి) దశలవారీ ఉద్యమాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 3) నుంచే ప్రైవేటు కళాశాలల బంద్ చేపట్టనున్నట్టు ఫతి చైర్మన్ నిమ్మటూరి రమేశ్‌బాబు, నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, కొడాలి కృష్ణారావు వెల్లడించారు.
Telangana:నవంబర్ లోగా ఫీజు బకాయిలను విడుదల చేయాలని, లేనట్టయితే నవంబర్ 3 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల్లో నిరవధిక బంద్ చేపడుతామని వారు ప్రకటించారు. ఈ పోరాటంలో భాగంగా నవంబర్ 6న రెండు లక్షల మంది అధ్యాపకులతో హైదరాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అదే విధంగా నవంబర్ 10వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ చేపడుతామని హెచ్చరించారు.
Telangana:వాస్తవంగా దసరా పండుగకు ముందు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫతి) ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వం చర్చలకు పిలిచి, విడతల వారీగా నిధుల విడుదలకు అంగీకరించింది. దీంతో ఫతి ఆందోళనలను విరమించింది. ఈ సమయంలో 1200 కోట్ల నిధుల విడుదలకు అంగీకరించిన సర్కారు.. తొలుత రూ.300 విడుదల చేసింది. ఆ తర్వాత దీపావళి విడతను మరిచింది. దీంతో మళ్లీ ఆందోళనలకు కళాశాలల యాజమాన్యాలు ముందుకొచ్చాయి.

