London

London: లండన్ రైల్లో ప్రయాణికులపై కత్తిపోట్లు, 10 మందికి తీవ్ర గాయాలు

London: బ్రిటన్‌లో శనివారం సాయంత్రం భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. లండన్ నుంచి కేంబ్రిడ్జ్‌షైర్‌లోని హంటింగ్‌డన్‌కు వెళ్తున్న ఒక రైలులో దుండగులు కత్తులతో బీభత్సం సృష్టించారు. రైలులో ప్రయాణిస్తున్న వారిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు భయంతో రైలులోని వాష్‌రూమ్‌లలో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడిలో మొత్తం 10 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్ (BTP), కేంబ్రిడ్జ్‌షైర్ పోలీసులు వెల్లడించారు. వెంటనే స్పందించిన అత్యవసర సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read: Mahammad Ali Shabbir: ఎంఐఎం పార్టీపై కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

దాడి జరుగుతున్నట్లు రైలులోని ఒక ప్రయాణీకుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రైలు కంపార్ట్‌మెంట్లలో ఆర్తనాదాలు, అరుపులు రావడంతో పోలీసులు తక్షణమే స్పందించి, హంటింగ్‌డన్ స్టేషన్‌లో రైలును ఆపివేశారు. సంఘటన స్థలంలోనే దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, రైలు ఆగిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద కత్తితో ఒక వ్యక్తి కనిపించగా, పోలీసులు టేజర్ (Taser) ఉపయోగించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిని పోలీసులు పెద్ద సంఘటనగా ప్రకటించి, దీని వెనుక ఉన్న ఉద్దేశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద నిరోధక విభాగం (కౌంటర్‌ టెర్రరిజం పోలీస్‌) కూడా దర్యాప్తులో భాగమైంది.

బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ సంఘటనను భయంకరమైనదిగా అభివర్ణించారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశిస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా బ్రిటన్‌లో కత్తులతో దాడుల సంఘటనలు క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత సంవత్సరంలో ఇంగ్లాండ్, వేల్స్‌లో 50,000 కంటే ఎక్కువ కత్తులతో దాడికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి, ఇది 2013తో పోలిస్తే దాదాపు రెట్టింపు. రాబోయే పదేళ్లలో కత్తులతో నేరాలను సగానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బహిరంగంగా కత్తిని తీసుకెళ్లడం వల్ల నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *