Srikakulam collector: తొక్కిసలాట ఘటన జరిగిన ఆలయానికి దేవాదాయ శాఖతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల సొత్తు అని, ఒక వ్యక్తి స్వంత నిధులతోనే ఆలయాన్ని నిర్మించారని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
కాగా,
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటన తనను చాలా బాధించిందని పేర్కొంటూనే, భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. కాశీబుగ్గలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యంగా, ఈ ఆలయం ప్రైవేట్ వ్యక్తి నిర్వహణలో ఉండటంపై సీఎం చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ, ఆలయ నిర్వాహకులు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కనీసం పోలీస్ బందోబస్తు కూడా లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం చాలా దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని సీఎం తేల్చి చెప్పారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసులను, ఉన్నతాధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. “నిండు ప్రాణాలు పోయాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు” అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాక, ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలు, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారించి, భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

