CM Chandrababu: మొంథా’ తుపాను (Cyclone Montha) ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అద్భుతంగా పనిచేసిన అధికారులకు మరియు సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇవాళ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముందు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ఆయన పేర్కొన్నారు.
అధికారులు, యువ ఐఏఎస్‌లకు ప్రత్యేక అభినందనలు
తుపాను వంటి అతిపెద్ద విపత్తును లెక్క చేయకుండా అధికారులు అంకితభావంతో పనిచేశారని సీఎం కొనియాడారు..ముఖ్యంగా యువ ఐఏఎస్ (IAS) అధికారుల టీమ్‌తో తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు అన్నారు. సైక్లోన్ అలర్ట్ వచ్చిన నాటి నుంచే తుపాను ట్రాకింగ్ మొదలుపెట్టామని తెలిపారు. అవేర్ సిస్టమ్ (Aware System) ద్వారా ఎప్పటికప్పుడు ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేశామని, టౌన్లలో సీసీ కెమెరాల సాయంతో ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేసి, లోతట్టు ప్రాంతాల్లో ముంపును తగ్గించామని వివరించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), ఫైర్ సర్వీసెస్, రెవెన్యూ సిబ్బంది అద్భుతంగా పనిచేశారని, భవిష్యత్తులో కూడా ఈ టీమ్ వర్క్ కొనసాగించాలని ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి: Viral News: వివాహ బంధంతో ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, ఫ్రాన్స్ అమ్మాయి
నష్టం అంచనా, కీలక రక్షణ చర్యలు
ముఖ్యమంత్రి తుపాను తీవ్రతను వివరిస్తూ, నిర్వహణలో తమ విజయాన్ని ఈ విధంగా వివరించారు..అతిపెద్ద తుపాను రాష్ట్రంలో తాకినప్పటికీ, కేవలం ఇద్దరు మాత్రమే దురదృష్టవశాత్తు మృతి చెందారని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణ నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించగలిగామని తెలిపారు. తుపాను మొదట కాకినాడ దగ్గర తీరం దాటుతుందని భావించినప్పటికీ, అది మార్గం మార్చుకుని కవాలిలో భారీ వర్షాలు కురిపించిందని, ఆ తర్వాత తెలంగాణ వైపు వెళ్లి అక్కడ కూడా భారీ వర్షాలు కురిపించిందని వివరించారు. ఒంగోలులో డ్రోన్ల సహాయంతో ‘మున్నా’ అనే వ్యక్తిని కాపాడగలిగామని, టెక్నాలజీ పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం, రాష్ట్రంలో తుపాను వల్ల జరిగిన పట్టణ నష్టంపై రియల్ టైమ్ డేటా కలెక్ట్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

