Tollywood: టాలీవుడ్‌లో ఎన్నోమంది దర్శకులు ఉన్నప్పటికీ అందరికీ ప్రత్యేక గుర్తింపు రాదు. అయితే ఆ గుర్తింపు సాధించిన వారిలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఒకరు. ఆయన సినిమాల్లో మంచి కథ, భావోద్వేగాలు, సమాజానికి ఉపయోగపడే సందేశం, అవసరమైన స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు వంశీ పైడిపల్లి దాదాపు అరడజన్ సినిమాలు తెరకెక్కించారు. వాటిలో కొన్ని సూపర్ హిట్స్‌గా నిలవగా, మరికొన్ని యావరేజ్ టాక్ సాధించాయి.
2023లో వచ్చిన ‘వారసుడు’ చిత్రంతో మంచి కలెక్షన్స్ సాధించిన వంశీ పైడిపల్లి… ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయబోతున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అసలు ఈ ప్రాజెక్ట్‌ను మొదట పవన్ కళ్యాణ్ కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా అది కుదరకపోవడంతో, వంశీ పైడిపల్లి ఈ కథను సల్మాన్ ఖాన్ కు చెప్పారట. కథ నచ్చడంతో సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.


