Mahesh Kumar goud: తెలంగాణ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ చేస్తున్న విమర్శలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. అజారుద్దీన్‌కు క్యాబినెట్ హోదా ఇవ్వడంపై అభ్యంతరం చెప్పే హక్కు బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు.
బీజేపీ నేతలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేస్తుండడం పై స్పందించిన మహేశ్ గౌడ్, అజారుద్దీన్‌పై ఏ కేసులు ఉన్నాయో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించిన అజారుద్దీన్, ప్రజలకు సేవ చేసిన నాయకుడని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తిని మంత్రిగా చేయడంపై బీజేపీ ప్రశ్నించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లాభం కోసం అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారన్న బీజేపీ ఆరోపణలను మహేశ్ గౌడ్ ఖండించారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వం మూడు నెలల క్రితమే నిర్ణయించిందని, ఉప ఎన్నికలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అంతకుముందు, అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.


