Rain Alert: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరోసారి అప్రమత్తం చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
తుఫాను ప్రభావం: ఎక్కడెక్కడ వర్షాలు?
తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మొదలైన తీవ్ర అల్పపీడనం ఇప్పుడు వాయువ్య ఝార్ఖండ్ వైపు కదిలింది. ఇది రాబోయే 12 గంటల్లో మరింత ముందుకు కదిలి, బీహార్ మీదుగా ప్రయాణించి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
అయితే, దీని ప్రభావం వల్ల కేవలం తెలంగాణలోనే కాక, ఆంధ్రప్రదేశ్ సహా పలు తీర ప్రాంత జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
మూడు రోజులు జాగ్రత్త!
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మూడు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది.
ఇటీవల కురిసిన తుఫాను వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే తడిసి ముద్దయ్యాయి. అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఆ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్న సమయంలో, మళ్లీ వర్షాల హెచ్చరికలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పత్తి, వరి వంటి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు.
ప్రజలు, రైతులు అందరూ వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


