Indian Railways: రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యంగా అమరావతి మరియు గన్నవరం ప్రాంతాల్లో భారీ మెగా టెర్మినల్స్ నిర్మించాలని యోచిస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లు ప్రయాణించే అవకాశం ఉన్నందున, రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడంతో పాటు, భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు ఈ టెర్మినల్స్ చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా, విజయవాడ రైల్వే స్టేషన్ మీద ఉండే రద్దీని తగ్గించేందుకు గన్నవరం టెర్మినల్‌ను అభివృద్ధి చేయబోతున్నారు. అంతేకాకుండా, విజయవాడ మరియు గుంటూరు రైల్వే స్టేషన్లలో కూడా మరిన్ని రైళ్లు ఆగేందుకు, ప్రయాణించేందుకు వీలుగా విస్తరణ పనులు చేపట్టాలని రైల్వే శాఖ సిద్ధమైంది.
ఈ ప్రణాళికలో ముఖ్యంగా గమనించదగిన విషయం ఏమిటంటే, రాజధాని ప్రాంతం గుండా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ కొత్త లైన్‌లో, అమరావతి ప్రధాన స్టేషన్‌ను ఏకంగా మెగా కోచింగ్ టెర్మినల్‌గా మార్చబోతున్నారు. ఈ స్టేషన్‌లో ఏకంగా 8 రైల్వే లైన్లు మరియు 8 ప్లాట్‌ఫామ్‌లు నిర్మించాలనేది ప్లాన్. రైల్వే ఉన్నతాధికారుల అంచనా ప్రకారం, ఈ స్టేషన్ గుండా రోజుకు 120 రైళ్లు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ టెర్మినల్ నిర్మాణం కోసం సుమారు 300 ఎకరాల స్థలం అవసరమవుతుందని రైల్వే శాఖ అంచనా వేసి, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.
అదే విధంగా, గన్నవరం రైల్వే స్టేషన్‌ను కూడా మరో మెగా కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. దీని కోసం సుమారు 143 ఎకరాల స్థలం అవసరం అవుతుందని తెలుస్తోంది.


