Hyderabad

Hyderabad: 2 కోట్లకు ఆశపడి .. 23 కోట్ల మోసగాడిని తప్పించి.. దొంగ బుద్ధి చూపిన పోలీస్

Hyderabad: హైదరాబాద్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన రూ.23 కోట్ల మోసం కేసులో కీలక నిందితుడు సతీష్ కుమార్ (67) పోలీసు కస్టడీలో ఉండగానే పారిపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఘటన చుట్టూ అనేక అనుమానాలు రేగడంతో, పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు వెంటనే రంగంలోకి దిగారు.

లంచానికి కక్కుర్తిపడ్డ ఎస్సై
సతీష్ కుమార్, అతని భార్య, కూతురు కలిసి ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. వీరిపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్టోబర్ 23న, మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి సతీష్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్న సమయంలో అతను తప్పించుకున్నాడు. విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితుడిని తీసుకొస్తున్న టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ డబ్బుకు ఆశపడ్డాడు.

మహారాష్ట్ర నుంచి సదాశివపేట వరకు వస్తుండగా, ఎస్సై శ్రీకాంత్ గౌడ్ నిందితుడితో వేరే కారులో ప్రయాణించాడు. వెనుక వస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది కారుకు, ఈ కారుకు సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ సమయంలోనే సతీష్ కుమార్ ఎస్సైకు లంచం ఆశ చూపాడు. ‘తన బెయిల్ పిటిషన్ పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయకుండా చూస్తే రెండు కోట్ల రూపాయలు ఇస్తాను’ అని చెప్పాడు. ఆ డబ్బుకు ఆశపడి ఎస్సై తన విధిని పక్కన పెట్టాడు.

దాబా వద్ద నాటకం!
సదాశివపేట దగ్గర ఒక దాబా వద్ద కారు ఆపినప్పుడు, సతీష్ కుమార్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు. వారు మరొక కారులో దాబా వద్దకు రాగానే, ఎస్సై శ్రీకాంత్ గౌడ్ ఏకంగా నిందితుడిని వారికే అప్పగించి పంపేశాడు.

ఆ తర్వాత వెనుక వచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ‘నిందితుడు తప్పిపోయాడు’ అని ఎస్సై శ్రీకాంత్ గౌడ్ నాటకం ఆడారు. కానీ సిబ్బందికి అనుమానం వచ్చి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీరియస్ అయిన కమిషనర్ సజ్జనార్ గారు వెంటనే స్పందించి, ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చారు.

ప్రస్తుతం రూ.23 కోట్ల మోసం చేసి తప్పించుకున్న సతీష్ కుమార్ కోసం మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నమ్మకంగా ఉండాల్సిన పోలీసు అధికారి లంచానికి కక్కుర్తిపడి ఇలా నిందితుడిని తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *