Suryapet: సూర్యాపేట జిల్లాలో మరో దారుణం చోటుచేసుకన్నది. పోలీసు అధికారుల దుశ్చర్యతో ఓ మహిళ తన నిండు ప్రాణం బలి తీసుకున్నది. జిల్లాలోని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతికుమార్ వేధింపులు తాళలేక అదే మండలం వెంపటి గ్రామానికి చెందిన సోమనర్సమ్మ (50) తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
Suryapet: మృతురాలు సోమనర్సమ్మ కుమారుడు మహేశ్, కూతుళ్లు సరిత, అనిత ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 రోజుల క్రితం వెంపటి గ్రామంలోనే ఉండే సోమనర్సమ్మ బావ మల్లయ్య ఇంటిలో బంగారం పోయిందనే నెపంతో సోమనర్సమ్మపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మల్లయ్యతోపాటు మరికొందరు గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌లో కేసు విషయమై వాకబు చేశారు.
Suryapet: ఈ మేరకు నిన్న సోమనర్సమ్మను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి 8 గంటల వరకు ఆమెను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. కనీసం మహిళ అని కూడా చూడకుండా తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ ఆమెను వేధింపులకు గురిచేశారు. మల్లయ్య ఇంటిలో బంగారం దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని, లేదంటే జైలుకు పంపుతానని, నీ వేలి ముద్రలే ఘటనా స్థలంలో ఉన్నాయని ఆమెతోపాటు కుటుంబ సభ్యులనూ ఎస్ఐ బెదిరించారు.
Suryapet: ఎస్ఐ వేధింపులు, దొంగతనం అపవాదును తనపై మోపారన్న కారణంతో సోమనర్సమ్మ మనస్తాపం చెందింది. అదే రాత్రి ఇంటికి వెళ్లాక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. దీంతో ఎస్ఐ వేధింపులతోనే తన తల్లి ఆత్మహత్య చేసుకున్నదని, ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని సోమనర్సమ్మ కూతుళ్లు, కుమారుడు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


