Chiranjeevi

Chiranjeevi: డీప్‌ఫేక్‌పై ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి

Chiranjeevi: దేశాన్ని ‘వన్‌ నేషన్‌’గా మార్చిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏక్తా దివస్‌’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్‌లో జరిగిన ‘రన్‌ ఫర్‌ యునిటీ’ (Run for Unity) కార్యక్రమంలో చిరంజీవితో పాటు డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం చిరంజీవి ప్రసంగించారు.

సర్దార్ పటేల్ సందేశం

దేశాన్ని 560 ముక్కలైన సంస్థానాల నుంచి ఒక్కటిగా చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ అని చిరంజీవి కొనియాడారు. పటేల్ మనకు అందించిన ‘వన్‌ నేషన్‌’ (One Nation) అనేది మనకు ఇచ్చిన గొప్ప వరమని, ఆయన దృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. యూనిటీ ఆఫ్ డైవర్సిటీ అంటూ పటేల్ ఇచ్చిన సందేశాన్ని గుర్తుచేసుకుంటూ, హైదరాబాద్‌లో పోలీసులు ఈ కార్యక్రమం నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Digital Arrest: సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ .. ముంబై దంపతుల నుంచి రూ. 50 లక్షలు స్వాహా

డీప్‌ఫేక్ వీడియోలపై చిరంజీవి హెచ్చరిక

ఇటీవల తాను ఎదుర్కొన్న డీప్‌ఫేక్ (Deep Fake) వీడియోల సమస్యపై స్పందించిన చిరంజీవి, టెక్నాలజీ దుర్వినియోగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

డీప్‌ఫేక్ అనేది పెద్ద ‘గొడ్డలిపెట్టు లాంటిది’ అని తీవ్రంగా హెచ్చరించారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలన్నప్పటికీ, దాని వల్ల ముప్పు కూడా ఉందని స్పష్టం చేశారు. డీప్‌ఫేక్‌ సమస్యను అరికట్టడానికి ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. ఇటీవల కొందరు తన ఫోటోలు, వీడియోలను డీప్‌ఫేక్ చేసి అశ్లీల వీడియోలు/ఫోటోలు సృష్టించారని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Nara Rohith Wedding: ఘనంగా నారా రోహిత్ – శిరీషల వివాహం… హాజరైన చంద్రబాబు దంపతులు

ఈ విషయమై తాను ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ చాలా బలంగా ఉందని, ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని భరోసా ఇచ్చారు. తన కేసు విషయంలో సీపీ సజ్జనార్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ప్రజలు ఎవరూ డీప్‌ ఫేక్‌ లేదా సైబర్‌ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని చిరంజీవి సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *