Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాన్‌ కారణంగా కృష్ణా జిల్లాలో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వరి, ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పర్యటించారు. రైతుల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, వారికి ప్రభుత్వ సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు.

కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలోని పంట పొలాల్లో పవన్‌ కళ్యాణ్‌ పర్యటించి, రైతులతో మాట్లాడారు. తుఫాన్‌ కారణంగా పంట చేతికి వచ్చే సమయానికే నష్టపోయామని రైతులు బాధపడ్డారు. అప్పులు తీసుకుని సాగు చేసిన పంట వృథా అయిందని, ఎకరానికి రూ.30 వేల వరకు ఖర్చు అయ్యిందని వారు తెలిపారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులు అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు చెప్పారు.

రైతుల బాధలు విన్న పవన్‌ కళ్యాణ్‌ వారికి ధైర్యం చెప్పారు. “ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు. తుఫాన్‌ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు సాయం అందేలా చర్యలు తీసుకుంటాం” అని ఆయన హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో పంట నష్టం అంచనాలు పూర్తవుతాయని, నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని జిల్లా కలెక్టర్‌ బాలాజీ పవన్‌ కళ్యాణ్‌కు వివరించారు. ఈ పర్యటనలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్‌, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, కలెక్టర్‌ డీకే బాలాజీ పాల్గొన్నారు.

Also Read: Pak-Afghan: భారత్ కాదు.. అమెరికా నే..పాక్-ఆఫ్ఘన్ శాంతి చర్చలు విఫలం కావడానికి కారణం ఇదే

పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, చంద్రబాబు ముందుచూపుతో తీసుకున్న చర్యల వల్లే నష్టం కొంతవరకు తగ్గింది. ప్రజలకు ముందుగానే ఎలర్ట్‌ మెసేజులు పంపించాం. పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలో ఎక్కువ నష్టం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్‌, అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేశారు, అని చెప్పారు.

46 వేల హెక్టార్లలో వరి పంట, 14 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోందని, పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. ఇళ్లకు తిరిగి వెళ్తున్న కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు.

అలాగే డ్రైన్ల పూడిక తీయడం ద్వారా నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టినట్లు పవన్‌ తెలిపారు. గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్న చోట్ల యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నామని చెప్పారు. ఆక్వా రైతుల సమస్యలు కూడా తన దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారం కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని పవన్‌ స్పష్టం చేశారు. రెండు రోజుల్లో చెత్త తొలగింపు పనులు పూర్తి చేసేలా వేలాది మంది సిబ్బంది కృషి చేస్తున్నారు. ప్రజలు భయపడవద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది,” అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ధైర్యం ఇచ్చారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *