CM Revanth Reddy: ‘మొంథా’ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, సహాయక చర్యలు మరియు భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యం
తుపాను కారణంగా పంట నష్టం జరిగిన నేపథ్యంలో, రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా, వేగంగా సేకరించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టం వివరాలపై సీఎం ఆరా తీశారు. ధాన్యం తడవకుండా, రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Power of Antarvedi: లక్ష్మీ నరశింహ స్వామి గీచిన గీత సముద్రం దాటదా..!
ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ, ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు, అవసరమైతే సమీపంలోని ఫంక్షన్ హాల్స్‌కు లేదా ఇతర సురక్షిత ప్రదేశాలకు ధాన్యాన్ని తరలించేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సహాయక చర్యలు, అధికారులకు కఠిన ఆదేశాలు
సహాయక చర్యల విషయంలో ఎక్కడా అలసత్వం వహించకుండా, క్షేత్ర స్థాయిలో పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించారు. “ప్రతి ఒక్కరూ ఫీల్డ్‌లో ఉండాల్సిందే,” అని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని కఠినంగా హెచ్చరించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రహదారులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం కావడానికి అన్ని విభాగాలు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తుఫాన్ సహాయక చర్యలు, నష్ట నివారణ చర్యలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు నివేదికను అందజేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సమీక్ష నేపథ్యంలో, ధాన్యం సేకరణ మరియు తుఫాన్ సహాయక చర్యలు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

