Ben Austin: ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే విషాదం చోటు చేసుకుంది. 17 ఏళ్ల యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఫిల్ హ్యూస్ మరణం తర్వాత ఇలాంటి ఘటన మళ్లీ జరగడం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది.
మెల్బోర్న్కు చెందిన బెన్ ఆస్టిన్ ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ తరఫున టీ20 మ్యాచ్ కోసం నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం చేస్తున్న ప్రాక్టీస్‌లో అతడు బంతిని ఎదుర్కొంటున్న సమయంలో బంతి మెడకు గట్టిగా తగిలింది. వెంటనే కుప్పకూలిన బెన్ను సహచరులు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. అతడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ, నెక్ గార్డ్ లేకపోవడం గమనార్హం.
Also Read: Women’s World Cup: 97 ఆలౌట్ నుంచి 319/7 వరకు.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా అద్భుతమైన మలుపు!
దాదాపు రెండు రోజుల పాటు చికిత్స పొందినప్పటికీ, గురువారం ఉదయం బెన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటనపై ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ సంతాపం వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “బెన్ మరణం మాకు తీవ్ర షాక్ గురిచేసింది. అతని కుటుంబానికి, స్నేహితులకు మా సానుభూతి. ఈ సమయంలో వారి గోప్యతను గౌరవించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం,” అని పేర్కొన్నారు.
బెన్ కేవలం క్రికెట్లోనే కాకుండా ఫుట్‌బాల్‌లో కూడా చురుకుగా పాల్గొనేవాడని, క్లబ్లో అతని ప్రవర్తన అందరికీ ఆదర్శమని సహచరులు తెలిపారు. మార్చిలో “ఉత్తమ ఆటతీరు” అవార్డు అందుకున్న ఈ యువకుడు, ఆట పట్ల ఉన్న అంకితభావం అందరి మన్ననలు పొందింది. తన మరణ వార్త తెలిసిన తర్వాత క్లబ్ మైదానంలో పూలు, కార్డులు, బ్యాట్లు ఉంచి అభిమానులు నివాళులు అర్పించారు. క్రికెట్ విక్టోరియా, రింగ్‌వుడ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు కూడా సంతాపం తెలిపారు.

