PKL 2025-Telugu Titans: ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ అద్భుతమైన ఆటకు తెరపడింది. బుధవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌తో హోరాహోరీగా పోరాడినప్పటికీ, చివరికి ఓటమి పాలైంది. ఈ ఓటమితో తెలుగు టైటాన్స్ ట్రోఫీ రేసు నుంచి నిష్క్రమించింది.
క్వాలిఫయర్-2: పల్టాన్ చేతిలో ఓటమి
క్వాలిఫయర్-2 మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠను పంచింది. ఇరు జట్లు గట్టి పోటీని ఇచ్చాయి పుణెరి పల్టాన్ చేతిలో తెలుగు టైటాన్స్ 50-45 తేడాతో ఓటమిని చవిచూసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే పల్టాన్ రైడింగ్‌లో, డిఫెన్స్‌లో సమన్వయం ప్రదర్శించి, టైటాన్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. కీలక సమయాల్లో పల్టాన్ పాయింట్లు సాధించడంతో టైటాన్స్‌పై ఒత్తిడి పెరిగింది. టోర్నీలో చివరి వరకు పోరాడిన టైటాన్స్, ఈ మ్యాచ్‌లోనూ చివరి క్షణాల వరకు విజయం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అయినప్పటికీ, స్వల్ప తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా
టైటిల్ పోరు: పుణెరి పల్టాన్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ
క్వాలిఫయర్-2లో విజయం సాధించిన పుణెరి పల్టాన్, ఇప్పుడు ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. టైటిల్ కోసం పల్టాన్ శుక్రవారం నాడు దబంగ్ ఢిల్లీని ఢీకొననుంది. లీగ్‌లో పటిష్టమైన ప్రదర్శన కనబరిచిన రెండు జట్లు ఫైనల్‌కు చేరుకోవడంతో, టైటిల్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. దబంగ్ ఢిల్లీ డిఫెన్స్‌లో, పల్టాన్ రైడింగ్‌లో బలంగా ఉన్నాయి. రెండు టీమ్స్ బలంగా ఉండటంతో, ఈ సీజన్ ఛాంపియన్ ఎవరో తెలుసుకోవడానికి కబడ్డీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైటాన్స్ ఓటమితో ఈ సీజన్ తెలుగు ప్రేక్షకులకు నిరాశ మిగిల్చినా, లీగ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్కంఠ పెరిగింది.

