Mohammad Rizwan: పాకిస్థాన్ క్రికెట్లో మరో సంచలనం చోటు చేసుకుంది. స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సమర్పించిన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేయడానికి నిరాకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రిజ్వాన్ ఇటీవల పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం, తనను టీ20 కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని రిజ్వాన్ PCBని కోరినట్లు తెలుస్తోంది. బోర్డు నుండి సరైన వివరణ వచ్చే వరకు సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేయబోనని మొహ్సిన్ నఖ్వీకి తేల్చి చెప్పినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Montha Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు.. పత్తిపై ఎఫెక్ట్
ఇటీవల వరుస వైఫల్యాల నేపథ్యంలో రిజ్వాన్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, షాహీన్ షా అఫ్రిదికి బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామంపై రిజ్వాన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో, రిజ్వాన్ నేషనల్ టీ20 కప్‌లో ఆడకుండా క్లబ్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై పాక్ మాజీ క్రికెటర్లు కొందరు విమర్శలు గుప్పించారు. దీనిని PCBను అవమానించడంగా పేర్కొంటూ, రిజ్వాన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని మొహ్సిన్ నఖ్వీని మాజీ పేసర్ సికందర్ బఖ్త్ బహిరంగంగా డిమాండ్ చేయడం కూడా గమనార్హం. మహ్మద్ రిజ్వాన్ చర్య పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మరోసారి కలకలం రేపింది. బోర్డు తమ స్టార్ ఆటగాడికి ఎలా స్పందిస్తుందో, ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

