Mustafabad to Kabir Dham: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామం పేరును ‘కబీర్ ధామ్’గా మార్చనున్నట్లు సోమవారం వెల్లడించారు. ముస్లిం కుటుంబం ఒక్కటీ లేని ఈ గ్రామానికి ముస్తఫాబాద్ అనే పేరు ఎందుకు ఉందన్న సందేహం వ్యక్తం చేసిన ఆయన, ఇది సంత్ కబీర్ మహాత్మునితో ముడిపడిన ప్రదేశం కాబట్టి, ఇకపై ఈ గ్రామం ‘కబీర్ ధామ్’గా పిలువబడుతుంది అని స్పష్టం చేశారు.
స్మృతి ప్రకటోత్సవ మేళా వేదికగా ప్రకటన
లఖింపూర్ ఖేరీలోని విశ్వ కళ్యాణ్ ఆశ్రమంలో జరిగిన ‘స్మృతి ప్రకటోత్సవ మేళా 2025’ లో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చాక గ్రామం పేరు ముస్తఫాబాద్ అని తెలిసింది. ముస్లింలు ఎంతమంది ఉన్నారని అడిగితే – ఒక్క కుటుంబం కూడా లేదని చెప్పారు. అందుకే పేరు మారుస్తున్నాం. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించాను అని తెలిపారు.
సాంస్కృతిక పునరుద్ధరణలో మరో అడుగు
ఈ నిర్ణయం సంత్ కబీర్ వారసత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా తీసుకున్నదని యోగి తెలిపారు. ఇది మతపరమైన నిర్ణయం కాదు, సంస్కృతి పరిరక్షణకు సంకేతం. గతంలో ముస్తఫాబాద్‌గా మార్చిన ఈ ప్రాంతానికి ఇప్పుడు దాని అసలు గౌరవాన్ని తిరిగి ఇస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Credit Card Rewards: క్రెడిట్ కార్డుతో రివార్డు పాయింట్లు, ప్రయోజనాలు ఇవే..!
గత ప్రభుత్వాలపై యోగి విరుచుకుపాటు
గత ప్రభుత్వాలపై విరుచుకుపడిన యోగి, అయోధ్యను ఫైజాబాద్‌గా, ప్రయాగ్‌రాజ్‌ను అలహాబాద్‌గా మార్చడం ప్రజల విశ్వాసాలకు దెబ్బ. ఇది లౌకికవాదం కాదు – కపటత్వం. కానీ మా ప్రభుత్వం వాటి పాత వైభవాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఇప్పుడు కబీర్ ధామ్ కూడా ఆ జాబితాలో చేరబోతోంది అని వ్యాఖ్యానించారు.
‘కబ్రిస్తాన్ గోడల’ బదులు ‘విశ్వాస కేంద్రాలు’
గత ప్రభుత్వాలు నిధులను కబ్రిస్తాన్ గోడలు నిర్మించడానికి ఉపయోగించాయని, కానీ తాము ఆ నిధులను మతపరమైన, సాంస్కృతిక పునరుజ్జీవన ప్రాజెక్టులకు వినియోగిస్తున్నామని యోగి అన్నారు. ప్రతి తీర్థయాత్ర స్థలాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. కాశీ, అయోధ్య, కుషినగర్, నైమిశారణ్య, మధురా, బృందావనం, గోకుల్, గోవర్ధన – ప్రతి విశ్వాస కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని వివరించారు.
ముస్తఫాబాద్ గ్రామం వివరాలు
2011 జనాభా లెక్కల ప్రకారం, ముస్తఫాబాద్ గ్రామంలో 77 కుటుంబాలు, మొత్తం 495 మంది జనాభా ఉంది. వీరిలో 24.2 శాతం షెడ్యూల్డ్ కులాలవారు (ఎస్సీ) కాగా, బ్రాహ్మణ, యాదవ, వర్మ వర్గాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామం గోలా గోకరన్ నాథ్ తహసీల్ పరిధిలోకి వస్తుంది.

