Nara Lokesh: మొంథా తుపాను (Montha Cyclone) ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా తీరప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉండవచ్చని అంచనాల మధ్య, ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండాలి
తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తక్షణమే ప్రజల మధ్య ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని లోకేష్ సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడండి” అని ఆదేశించారు.
కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
ప్రస్తుత వాతావరణ సమాచారాన్ని ప్రస్తావించిన లోకేష్, మొంథా తుపాను కాకినాడ (Kakinada) సమీపంలో తీరం దాటే అవకాశముందని తెలిపారు. ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలకు అవసరమైన సాయం అందించాలన్నారు.
ఇది కూడా చదవండి: Delhi: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సహాయక చర్యల్లో కూటమి కేడర్ పాల్గొనాలి
అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన కేడర్ ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. తీరప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శిబిరాల్లో నిరాశ్రయులకు అవసరమైన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
వైద్య, ఆరోగ్య శాఖలకు ప్రత్యేక సూచనలు
భారీ వర్షాల కారణంగా అంటురోగాలు ప్రబలకుండా వైద్య మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టాలని లోకేష్ ఆదేశించారు. అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్స్‌లు, మందులు, వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు సజావుగా ఉండాలి
ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా సంబంధిత శాఖ సిబ్బంది ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ వ్యవస్థల్లో అంతరాయం లేకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు.
చెరువులు, పంట పొలాలపై అప్రమత్తం
భారీ వర్షాల కారణంగా చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలు, యంత్రాలు, సిబ్బంది సిద్ధంగా ఉంచాలని సూచించారు. పంట పొలాల్లో నీరు నిలిచిపోకుండా ఆయిల్ మోటార్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. “తుఫాన్ బాధితులకు అవసరమైన సాయం వెంటనే అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలు సిద్ధంగా ఉంటుంది” అని ఆయన భరోసా ఇచ్చారు.

